తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శాసనసభలో ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సీటు వద్దకు మంత్రి కేటీఆర్ వెళ్లారు. ఈటలను ఆప్యాయంగా పలకరించి.. ఆలింగనం చేసుకున్నారు. పదినిమిషాల పాటు ఇద్దరు నేతలు మాట్లాడుకున్నట్లు సమాచారం. గతంలో కేసీఆర్‌తో విభేదించిన ఈటల.. బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, ఉప ఎన్నికలో తీవ్ర పోటీని ఎదుర్కొని విజయం సాధించారు. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్‌గా ఈటల కొనసాగుతున్నారు. మరోవైపు మంత్రి కేటీఆర్‌‌ను కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కలిశారు. కేటీఆర్ చాంబర్‌‌లో ఈ మేరకు ఇద్దరు నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్, జగ్గారెడ్డి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగినట్లు తెలుస్తోంది. టీషర్ట్‌తో వచ్చిన జగ్గారెడ్డిని ‘పిల్లలతో కలిసి తిరిగితే ఎలా?’ అంటూ కేటీఆర్ సరదాగా అడిగారు. బదులిచ్చిన జగ్గారెడ్డి.. ‘టీషర్ట్ తో వస్తే పిల్లలవుతారా?’ అంటూ నవ్వుతూ ప్రశ్నించారు. జగ్గారెడ్డితో టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ ఉండటంతో.. ‘మీ దోస్తాన్ ఎక్కడ కుదిరింది?’ అని కేటీఆర్ అడిగారు. ‘తమది ఒక మంచం.. ఒకే కంచం’ అని మామిళ్ల రాజేందర్ చెప్పారు. ఈటల, జగ్గారెడ్డితో కేటీఆర్ సంభాషణ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది.