కాయకష్టాన్ని నమ్ముకుని ఆటుపోట్లతో జీవనం సాగిస్తున్న మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపడి వారు సంపూర్ణ ఆనందంతో ఉండాలని ఆకాంక్షిస్తున్నానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పారు. ఎన్నికల తర్వాత రాబోయే ఉమ్మడి ప్రభుత్వంలో ఆ దిశగా అడుగులు వేస్తామని తెలిపారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా వారికి పవన్ శుభాకాంక్షలు తెలిపారు. మెరైన్ ఫిషింగ్ కు తగినట్టుగా మన రాష్ట్రానికి సుదీర్ఘ సముద్ర తీరం ఉందని… ఇన్ ల్యాండ్ ఫిషింగ్ కు అనువుగా ఎన్నో జలవనరులు ఉన్నాయని పవన్ చెప్పారు. మన మత్స్యకారులకు సరైన జీవనోపాధి లేకపోవడంతో ఇతర రాష్ట్రాలకు వలసపోతున్నారని అన్నారు. మత్స్యకారుల సంక్షేమం, ఉపాధి కల్పనపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడమే దీనికి కారణమని చెప్పారు. గుజరాత్, కేరళ తీరాల్లో ప్రతి 30 కిలోమీటర్లకు ఒక జెట్టీ ఉండటంతో వారి ఉపాధికి, వేటకు సౌలభ్యం ఏర్పడిందని అన్నారు.  ముఖ్యమంత్రి జగన్ నివాసానికి రూ. 451 కోట్ల వెచ్చించేందుకు నిధులు విడుదల చేసే ఈ ప్రభుత్వం… మత్స్యకారులకు జట్టీలు, హార్బర్లను నిర్మిచేందుకు మాత్రం ఆసక్తి చూపడం లేదని విమర్శించారు. విశాఖ రుషికొండపై నిర్మిస్తున్న రాజ్ మహల్ కోసం వెచ్చిస్తున్న డబ్బుతో ఒక హార్బర్ నిర్మించవచ్చని చెప్పారు. వైసీపీ ప్రభుత్వానికి మత్స్యకారుల సంక్షేమం ముఖ్యం కాదని… రుషికొండను కొట్టేసి మహల్ ను నిర్మించుకోవడమే ముఖ్యమని తెలిపారు. మత్స్యకారుల సంక్షేమ పథకాల్లో కూడా నిబంధనల పేరుతో కోతలు విధిస్తున్నారని దుయ్యబట్టారు. రాబోయే ఉమ్మడి ప్రభుత్వంలో హామీలు, శంకుస్థాపనలతో సరిపుచ్చకుండా… మత్స్యకారుల ఉపాధి కల్పనపై ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తామని చెప్పారు.