తెలుగుదేశం పార్టీతో తెలంగాణ నూతన సీఎం రేవంత్ రెడ్డి గతానుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా రేవంత్ రెడ్డి గుర్తింపు పొందారు. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో ఆ బంధం వీడింది. టీడీపీకి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి 2017లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదిగి, నేడు సీఎం పదవిని అధిష్ఠించారు. 

ఈ నేపథ్యంలో, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు శుభాకాంక్షలు తెలిపారు. తన ట్వీట్ లో ఎనుముల రేవంత్ రెడ్డి గారు అంటూ గౌరవంగా సంబోధించారు. 

“తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన ఎనుముల రేవంత్ రెడ్డి గారికి అభినందనలు. తన పదవీకాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజాసేవలో రేవంత్ రెడ్డి విజయవంతం కావాలని కోరుకుంటున్నాను” అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.