తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ఈ మధ్యాహ్నం పదవీ ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.

రేవంత్ రెడ్డితో తనకు వ్యక్తిగత స్నేహం ఉందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. తెలంగాణలో యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో రేవంత్ కూడా పాల్గొన్నారని, ఆ అంశంపై కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాన్ని సూటిగా వెల్లడించారని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. వాగ్దాటి, ప్రజాకర్షణ కలిగిన ఆయన రాజకీయంగా ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కొంటూ పోరాటాలు చేసి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారని కొనియాడారు. 

“తెలంగాణలో జరిగిన ఉద్యమాలు, వాటి నేపథ్యాలపై సంపూర్ణ అవగాహన ఉన్న నాయకుడు రేవంత్ రెడ్డి. నీళ్లు, నిధులు, నియామకాలు… ప్రధాన అంశాలుగా పోరాడి సాధించుకున్న రాష్ట్రం తెలంగాణ. రాష్ట్ర సాధన కోసం అమరులైన యువత ఏ ఆశయాల కోసం ఆత్మ బలిదానాలు చేసిందో… ఆ ఆశయాలను రేవంత్ ప్రభుత్వం సంపూర్ణంగా నెరవేర్చి ఆ త్యాగాలకు గౌరవాన్ని, సార్థకతను కల్పించాలి. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమం, అభివృద్ధితో తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అంటూ పవన్ తన ప్రకటనలో పేర్కొన్నారు. 

Previous articleవిశాఖలోని ఏఎస్ రాజా గ్రౌండ్స్ లో జనసేన సభ
Next articleసీఎంగా రేవంత్ రెడ్డి సక్సెస్ అవ్వాలి