ఆంధ్రప్రదేశ్‌లో మద్యం అక్రమాలపై తాము సీబీఐ విచారణ కోరుతామని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఆమె శుక్రవారం విజయవాడ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ… అక్రమ మద్యం అమ్మకాల ద్వారా వైసీపీ నేతలు తమ జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు. నిన్న నరసాపురంలో ఓ దుకాణాన్ని తనిఖీ చేయగా రూ.1 లక్ష విక్రయాలు జరిపితే కేవలం రూ.700 బిల్లులు మాత్రమే చూపించారన్నారు.ప్రతిరోజు మద్యం విక్రయాల ద్వారా వైసీపీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా అనధికారికంగా పెద్ద మొత్తాన్ని తమ జేబుల్లో వేసుకుంటున్నారన్నారు. ప్రజల కష్టార్జితాన్ని దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. ప్రజల జేబు నుంచి అన్యాయంగా డబ్బులు తీసుకొని, ఉచితాలు ఇస్తున్నామనే దిశగా మాట్లాడటం రాష్ట్ర ప్రభుత్వానికి సమర్థనీయం కాదన్నారు. కాగా, అంకుముందు పార్టీ కార్యాలయంలో ఆమె నరేంద్రమోదీ ఫోటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు.