నటి సాయిపల్లవి తమిళ దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామిని రహస్యంగా పెళ్లాడిందంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. సాయిపల్లవి, పెరియసామి మెడలో దండలతో ఉన్న ఫొటో కావడంతో ఆ వార్త వెంటనే పాకిపోయింది. దాంతో, సాయిపల్లవి వెంటనే స్పందించింది. పుకార్లను ఖండించింది. ఆ ఫొటో తన కొత్త చిత్రం (ఎస్కే 21) ముహూర్త కార్యక్రమం సందర్భంగా తీసినదని వెల్లడించింది. “నిజాయతీగా చెప్పాలంటే నేను వదంతుల గురించి పట్టించుకోను. కానీ నా స్నేహితులను, కుటుంబాన్ని కూడా ఇలాంటి విషయాల్లోకి లాగితే మాత్రం తప్పకుండా మాట్లాడతాను. వాస్తవానికి అది నా కొత్త సినిమా ప్రారంభోత్సవంలోనిది. డబ్బుకు అమ్ముడుపోయి, ఆ ఫొటోను కత్తిరించి తప్పుడు ఉద్దేశాలతో ప్రచారం చేస్తున్నారు. నా కెరీర్ గురించి పంచుకోవడానికి ఎన్నో ఆహ్లాదకరమైన సంగతులు ఉన్నప్పుడు, ఇలాంటి ఆకతాయి చేష్టల గురించి స్పందించాల్సి రావడం బాధ కలిగిస్తోంది. ఈ విధంగా తప్పుడు ఫొటోలతో ఒకరిని ఇబ్బంది పెట్టాలనుకోవడం నీచమైన పని” అని సాయిపల్లవి ఘాటుగా స్పందించారు.