విశాఖ స్టీల్ ప్లాంట్ మైదానం వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏపీ సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ లపై విరుచుకుపడ్డారు. శనివారం సాయంత్రం విశాఖ స్టీల్ ప్లాంట్ మైదానంలో జరిగిన ‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఏపీలో జగన్, చంద్రబాబు ఎవరు గెలిచినా మోదీ వైపే ఉంటారని విమర్శించారు. బీజేపీ అంటేనే బాబు, జగన్, పవన్ అని కొత్త అర్థం చెప్పారు. ఇప్పుడు ఏపీకి కావాల్సింది పాలకులు కాదని… ఢిల్లీలో ప్రశ్నించే గొంతు అన్నారు. మనం తెలుగువాళ్లం.. మనమంతా అన్నదమ్ములం… రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగువారిగా కలిసి ఉందామన్నారు.

ఏపీలో పదేళ్ళుగా ప్రశ్నించే గొంతుకలు లేవన్నారు. ఢిల్లీలో ఉన్న మోదీ ఇక్కడి వారి ద్వారా ఏపీని శాసించాలని అనుకుంటున్నారని ఆరోపించారు. జగన్, చంద్రబాబు ఏపీ ప్రయోజనాల కోసం ఈ పదేళ్లలో ఎప్పుడూ కొట్లాడలేదని విమర్శించారు. ఢిల్లీని అడిగి.. ప్రశ్నించి ఏపీకి లాభం చేసే నాయకులు లేకుండా పోయారన్నారు. ఏపీలో మళ్లీ వారిద్దరిలో ఎవరు గెలిచినా మోదీ దగ్గరకే వెళతారని గుర్తించాలన్నారు. జగన్, చంద్రబాబు, పవన్ లకు మోదీని ఎదిరించి నిలిచే శక్తి ఉందా? అని ప్రశ్నించారు.