పల్నాడు జిల్లాలో గత ప్రభుత్వంలో సేకరించిన భూములలో అప్పటి మంత్రి విడదల రజిని అవినీతి బాగోతం ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. జిల్లాలోని చిలకలూరిపేట నియోజకవర్గం పసుమర్రు గ్రామంలో ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ప్రకారం ఎకరా రూ12 లక్షలు పలుకుతోంది. ఐతే జగనన్న ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వానికి ఇస్తే ఎకరాకు 31 లక్షలుఇప్పిస్తానంటూ అప్పటి మంత్రి రజిని రైతులకు ఎరేశారు. ఐతే అందులో కొంత కమిషన్‌ కోరుకున్నారు. మధ్యవర్తులుగా కొందరిని పంపారు. మొదటి రెండు విడతల్లో 50 ఎకరాలు సేకరించగా ఎకరాకు రెండున్నర లక్షల చొప్పుున మొత్తం కోటి 16 లక్షలు రైతుల నుంచి వసూలు చేశారు. మూడు, నాలుగు విడతల్లో 100 ఎకరాల వరకు సేకరించారు. అందులో ఎకరాకు ఏడున్నర లక్షలు చొప్పున ఏడున్నర కోట్లు ఇవ్వాలంటూ రైతుల నుంచి ముందుగానే చెక్కులు, నోట్లు తీసుకున్నారు. పసుమర్రుకు చెందిన రైతులు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుకు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకు ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీని కూడా కలిశారు. విచారణ జరిగితే గుట్టు రట్టవుతుందని భావించిన రజనీ మనుషులు మొదట తీసుకున్న కోటి 16 లక్షలు తిరిగి ఇచ్చేశారు. గుదేవారిపాలెం రైతులు కూడా తమ వద్ద తీసుకున్న కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో రజనీ ముఠా బాధితులు మరికొందరు బయటికొస్తున్నారు. తమ వద్ద రెండున్నర కోట్ల వరకూ వసూలు చేశారంటూ బోయపాలెంలోని స్టోన్‌ క్రషర్ల యాజమాన్యాల కూడా SPకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు.