ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఈరోజు ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మంత్రి అంబటి రాంబాబుపై మీసం మెలేసిన టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ.. ‘దమ్ముంటే రా’ అని సవాల్ విసిరారు. ‘నువ్వు రా’ అంటూ అంబటి కూడా అదే స్థాయిలో రెస్పాండ్ అయ్యారు. ఆ తర్వాత అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులందరినీ స్పీకర్ తమ్మినేని సస్పెండ్ చేశారు. అనంతరం టీడీపీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ… అంబటి రాంబాబు తనకు మీసం చూపించి, తొడగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వృత్తిని అవమానిస్తేనే తాను రియాక్ట్ అయ్యానని చెప్పారు. అంబటి వ్యాఖ్యలకు కౌంటర్ గా తాను కూడా మీసం మెలేసి, తొడగొట్టానని తెలిపారు. సినిమాను అవమానిస్తే తానే కాదు, తన స్థానంలో ఉన్న ఎవరైనా ఇలాగే రియాక్ట్ అవుతారని చెప్పారు. తన వృత్తి తనకు తల్లిలాంటిదని, తల్లిని అవమానిస్తే ఊరుకుంటానా? అని ప్రశ్నించారు. ఏదైనా ఉంటే సినిమాల్లో చూపించుకో అని అంబటి అన్నారని… అందుకే తాను ‘చూసుకుందాంరా’ అని సవాల్ విసిరానని చెప్పారు. తిడితే అందరిలాగే పడతానని అంబటి అనుకున్నారని… తన రియక్షన్ చూసి బిత్తరపోయారని ఎద్దేవా చేశారు.
వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు మొత్తం సినీ పరిశ్రమనే కించపరిచారని మండిపడ్డారు. తప్పుడు కేసులకు తాను కూడా భయపడేది లేదని అన్నారు. తాను ఎవరికీ భయపడనని, భయపడాల్సిన అవసరం కూడా తనకు లేదని చెప్పారు.