ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేడు ప్రారంభం అయ్యాయి. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో, సభా సమావేశాల తొలిరోజే సభలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. టీడీపీ సభ్యులు పోడియంను ముట్టడించడం, మంత్రి అంబటి రాంబాబు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ మధ్య సవాళ్లు-ప్రతిసవాళ్లు, టీడీపీ సభ్యుల సస్పెన్షన్ తదితర వాడీవేడి పరిణామాలు చోటుచేసుకున్నాయి. అసెంబ్లీ సమావేశాల నుంచి సస్పెండ్ అయిన అనంతరం, అచ్చెన్నాయుడు తదితర టీడీపీ ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడారు. 17 మందికి సమాధానం చెప్పలేకపోయారంటూ అచ్చెన్నాయుడు అధికార పక్షంపై ధ్వజమెత్తారు. 200 మంది మార్షల్స్ సాయంతో నచ్చినట్టు సభను నడిపించుకోవడానికే తమను బయటకు పంపారు అని వ్యాఖ్యానించారు.