తన జీవితంలో తొలిసారి టీడీపీ అధినేత చంద్రబాబు జైలు జీవితాన్ని గడుపుతున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబుకు విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ ను విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. జైల్లో ఆయనకు స్నేహ బ్లాక్ లో ఒక ప్రత్యేక గదిని కేటాయించారు. అన్ని వసతులు కల్పించారు. ఒక సహాయకుడితో పాటు, ఐదుగురు సిబ్బందితో భద్రతను కల్పించారు. అంతేకాదు ఆయన ఉన్న బ్లాక్ చుట్టూ భారీ భద్రతను ఏర్పాటు చేశారు. డ్యూటీ సిబ్బంది మినహా మరెవరినీ అక్కడకు వెళ్లనీయడం లేదు.  చంద్రబాబుకు ఇంటి నుంచి భోజనం తెప్పించుకునేందుకు కోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఉదయం అల్పాహారంగా ఆయనకు ఫ్రూట్ సలాడ్ ను కుటుంబ సభ్యులు పంపించారు. అల్పాహారం తర్వాత తాగేందుకు వేడి నీళ్లు, బ్లాక్ కాఫీని సిబ్బంది అందించారు.