టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్, రిమాండ్ నేపథ్యంలో ఏపీ అట్టుడుకుతోంది. రాష్ట్ర బంద్ కు టీడీపీ పిలుపునిచ్చింది. బంద్ కు జనసేన, సీపీఐ, లోక్ సత్తా, జైభీమ్ పార్టీలు సంపూర్ణ మద్దతును ప్రకటించాయి. బంద్ నేపథ్యంలో టీడీపీ శ్రేణులు రోడ్ల మీదకు వచ్చి ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యమంత్రి జగన్ కు, వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. టీడీపీ కార్యకర్తలను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని తరలిస్తున్నారు. పలు చోట్ల టీడీపీ శ్రేణులపై పోలీసులు చేయి చేసుకున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు ఆందోళనకారులు రోడ్లపై టైర్లను కాల్చేస్తున్నారు. పలు చోట్ల విద్యా సంస్థలు, షాపులను స్వచ్చందంగా మూసివేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు 144 సెక్షన్ ను అమలు చేస్తున్నారు.