తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ హామీని నిలబెట్టుకునే దిశగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తుంది . వాటిబాటలోనే అడుగులు వేసేందుకు ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించుకుంది. అయితే తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణం విధివిధానాల పై ఒక నివేదిక రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించి దీనికోసం ఐదుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అతి త్వరలోనే ఈ కమిటీ నివేదికను సమర్పించనుంది. రేవంత్ రెడ్డి సర్కారు అనుసరిస్తున్న విధానాన్నే ఏపీలో కూడా అనుసరించాలని సీఎం భావిస్తున్నట్లు సమాచారం. జులై 1 నుంచి రాష్ట్రంలో అమలు చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు , దీనిపై రెండురోజుల్లో అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.