ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ నాటి సమావేశాల నుంచి టీడీపీ సభ్యులందరినీ ఒక్కరోజు పాటు స్పీకర్ సస్పెండ్ చేశారు. ఇప్పటికే కోటంరెడ్డి, అనగాని సత్యప్రసాద్ లను ఈ సెషన్ మొత్తానికి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, సభలో వీడియో తీస్తున్నారంటూ పయ్యావుల కేశవ్ ను కూడా ఈ సెషన్ మొత్తానికి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు.మరోవైపు, చంద్రబాబు అరెస్ట్ పై వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్టు స్పీకర్ తెలిపారు. దీంతో దోపిడి రాజ్యం, దొంగల రాజ్యం అంటూ టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన మాట్లాడుతూ… విపక్ష సభ్యులు స్పీకర్ పోడియంలో అద్దాలు, బాటిల్ పగులగొట్టారని… వారి తీరు క్రిమినల్స్ మాదిరి ఉందని చెప్పారు. ఇలాంటి సభా వ్యతిరేక చర్యలకు పాల్పడిన వారిని సభ నుంచి సస్పెండ్ చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో, అచ్చెన్నాయుడు, బాలకృష్ణ, బుచ్యయ్యచౌదరి, గద్దె రామ్మోహన్, చినరాజప్ప సహా టీడీపీ ఎమ్మెల్యేలందరినీ ఒక్కరోజు పాటు సభ నుంచి సస్పెండ్ చేశారు. వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై కూడా ఒక్కరోజు సస్పెన్షన్ వేటు వేశారు.