శేఖర్ కమ్ముల అనగానే సున్నితమైన భావోద్వేగాలు కలిగిన ప్రేమకథా చిత్రాలు కళ్లముందు కదలాడతాయి. ఆనంద్ .. గోదావరి .. ఫిదా .. లవ్ స్టోరీ వంటి సినిమాలను అందుకు ఉదాహరణగా చెప్పుకోవవచ్చు. అలాంటి శేఖర్ కమ్ముల ఈ సారి తన మార్క్ కథలను కాకుండా, భిన్నమైన మరో కంటెంట్ ను రెడీ చేసుకున్నాడు.ఈ సారి ఆయన కథానాయకుడుగా ధనుశ్ వంటి స్టార్ ను ఎంచుకున్నాడు. అంతేకాదు .. మాఫియా నేపథ్యంలో కథను తయారు చేసుకున్నాడు. తెలుగుతో పాటు తమిళంలోను ఈ సినిమాను విడుదల చేయనున్నాడు. ఇక సంగీత దర్శకుడిగా ఆయన దేవిశ్రీ ప్రసాద్ ను ఎంచుకోవడం మరో విశేషం. ఇలా అనేక విశేషాలు ఈ ప్రాజెక్టులో కనిపిస్తున్నాయి. సునీల్ నారంగ్ – పుస్కూర్ రామ్మోహన్ నిర్మిస్తున్న ఈ సినిమా, కొంతసేపటి క్రితం షూటింగును మొదలెట్టేసింది. అందుకు సంబంధించిన ఫొటోలు బయటికి వచ్చాయి కూడా. రష్మిక కథానాయికగా అలరించనున్న ఈ సినిమాలో, ఒక కీలకమైన పాత్రలో నాగార్జున కనిపించనున్నారు. కెరియర్ పరంగా ధనుశ్ కి ఇది 51వ సినిమా కావడం విశేషం.