భారత క్రికెట్ జట్టు ఆటగాళ్లు ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో ఓడిపోయిన తర్వాత ఆటగాళ్లందరూ స్వదేశానికి తిరిగి వచ్చి తమ కుటుంబాలతో సరదాగా గడుపుతున్నారు. కాగా, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు బీసీసీఐ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. భారత జట్టు తన తదుపరి సిరీస్‌ను వెస్టిండీస్‌తో ఆడనుంది. కరీబియన్ దీవుల్లో పర్యటించనున్న టీమిండియా జులై 12 నుంచి రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్‌లో తలపడనుంది. అయితే ఫామ్‌లో లేని కెప్టెన్ రోహిత్ శర్మను వెస్టిండీస్‌తో జరిగే మొత్తం టెస్టు లేదా వైట్‌బాల్ సిరీస్ నుంచి తొలగించే అవకాశం ఉందని సమాచారం. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు రోహిత్ శర్మకు అదనపు విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం వెస్టిండీస్ టీం ప్రస్తుతం బలహీనంగానే కనిపిస్తోంది. కానీ, తనదైన రోజున దిగ్గజ జట్లకు షాక్ ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లనే వెస్టిండీస్ పంపాలని భారత సెలక్షన్ కమిటీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే రోహిత్‌కు విశ్రాంతి సాకుతో పక్కనపెట్టనున్నట్లు తెలుస్తోంది.