ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ మెగా హీరోలు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ పిఠాపురంలో ప్రచారం నిర్వహించారు. ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా తన తమ్ముడు పవన్‌ను గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరుతూ ప్రత్యేక వీడియోను తాజాగా రిలీజ్ చేశారు. మరోవైపు జబర్దస్త్ ఆర్టిస్టులు గెటప్ శీను, సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్ సహా పలువురు నటీనటులు పవన్ తరఫున పిఠాపురంలో జోరుగా ప్రచారం చేస్తున్నారు. తాజాగా ఇప్పుడు నిర్మాత నాగ వంశీ కూడా పవన్ కళ్యాణ్‌ను పిఠాపురంలో అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ పిఠాపురంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పవన్‌ కళ్యాణ్ కి ఓటువేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఆయనతో పాటు తన టీమ్ కూడా ప్రచారంలో పాల్గొంది. ఇందుకు సంబంధించిన వీడియోలను జనసేన పార్టీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది .అయితే ఇటీవల ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్‌ రిలీజ్‌ ఫంక్షన్‌లో ఏపీ ఎన్నికలపై మీడియా అడిగిన ప్రశ్నకి నాగ వంశీ సమాధానమిచ్చారు. పవన్‌కు తమ మద్దతు ఉంటుందని స్టేజ్ మీదే చెప్పారు. సొంత ఊళ్ళని వదిలి హైదరాబాద్ తో పాటు ఎక్కడెక్కడో సెటిల్ అయిన అందరూ తమ ఉరికి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. దీనివల్ల ఓటింగ్‌ శాతం పెరిగి గెలుపు, ఓటములపై తప్పకుండా ప్రభావం చూపుతుందని తెలిపారు. ఇక ఎప్పుడూ తన మద్దతు పవన్ కళ్యాణ్ కి ఉంటుందని , తన వంతు సాయం తాను కూడా చేస్తానని నాగవంశీ స్టేజి మీద మాట్లాడారు. ఆ మాట ప్రకారం తాజాగా పిఠాపురంలో నాగ వంశీ పవన్ కళ్యాణ్ గెలుపును ఆకాంక్షిస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.