ఎందరికో ఆదర్శంగా నిలిచిన వ్యక్తి ఆయన .. తెలుగు సినిమా రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన వ్యక్తి ఆయన. కొణిదెల శివశంక వరప్రసాద్ నుండి మెగాస్టార్ చిరంజీవిగా ఎదిగిన ఆయన ప్రస్థానం నిజంగా యువతకు మార్గ దర్శకం.. 150 పైగా సినిమాలలో ఎన్నో విభిన్న పాత్రలు చేసిన చిరంజీవి ఎంత ఎదిగినా ఒదిగే ఉంటారు. సినిమా రంగంలోనే కాకుండా రాజకీయాల్లో కూడా అడుగుపెట్టి తన ముద్ర వేసుకున్నారు. ఇప్పటికే ఎన్నో అవార్డులు అందుకున్న చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే .. తాజాగా ఆయన ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా గురువారం సాయంత్రం 6 గంటలకు ఈ అవార్డును స్వీకరించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవితో పాటు ఆయన సతీమణి సురేఖ , కుమారుడు రామ్ చరణ్ ,కోడలు ఉపాసన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవికి సోషల్ మీడియా వేదికగా మెగా అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు. అక్కినేని నాగేశ్వరరావు తర్వాత టాలీవుడ్‌లో ఈ అవార్డు అందుకున్న రెండవ నటుడు చిరంజీవి కావడం మరో విశేషం. అవార్డు అందుకున్న చిరజీవి ప్రెస్ మీట్ సందర్బంగా స్పందించారు. 45 సంవత్సరాల సుదీర్ఘ సేవను గుర్తించి భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డ్ ఇచ్చిందని, తన కృషి , సేవతో పాటు తన అభిమానులు, ప్రేక్షకులు, దర్శక నిర్మాతలు టెక్నిషియన్స్‌కు మెగాస్టార్ చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు .. పద్మవిభూషణ్ అవార్డు రావటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఏ టైమ్‌కు ఏది రావాలంటే అది వస్తుందని.. తాను ఎప్పుడూ ఎదురు చూడనని అన్నారు. కాగా నందమూరి తారక రామారావు కు భారతరత్న అవార్డు రావాలని మెగాస్టార్ ఆకాంక్షించారు.ఎంజీఆర్‌ కు వచ్చినపుడు, ఎన్టీఆర్‌కు రావటం సబబే అన్నారు. అయితే రాజకీయాల గురించి మీడియా అడిగిన ప్రశ్నలకు మెగాస్టార్ స్పందిస్తూ తాను రాజకీయాలకు అతీతంగా ఉన్నానని.. ఏ పార్టీలో లేనని స్పష్టం చేశారు. కానీ తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కి తన సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని, అందుకే వీడియో చేశానని తెలిపారు. అయితే తాను పిఠాపురం పర్యటనకు వెళ్తున్నట్టు మీడియా నే సృష్టించిందని , తాను పిఠాపురం వెళ్ళటం లేదని చెప్పారు . నా తమ్ముడు పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ఈ అన్నయ్య క్షేమం కోరుకుంటాడని తెలిజేశారు. తానే కాదు తమ కుటుంబం మద్దతు ఎప్పుడూ తమ్ముడు పవన్‌కు ఉంటుందని చిరంజీవి స్పష్టం చేశారు.