ఏపీలో పొత్తుల రాజకీయం వేడెక్కుతోంది. టీడీపీ, జనసేన పొత్తు లాంఛనమే. రెండు పార్టీల నుంచి ఆశావాహులు తమ సీట్లు ఖరారు చేసుకొనేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసారు. బీజేపీ ఈ రెండు పార్టీలతో కలుస్తుందా లేదా అనేది స్పష్టత రాలేదు. ఆ పార్టీ కూడా జత చేరితే సీట్ల కోసం పోటీ మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. టీడీపీ నేత లోకేష్ కు పోటీగా కొత్త డిమాండ్ తెర మీదకు తెచ్చింది.

వచ్చే ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ, బీజేపీతో పొత్తు ఉంటుందని పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఇప్పటికే బీజేపీ నేతలతో మంతనాలు చేసారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లి అమిత్ షాతో చర్చలు జరిపారు. బీజేపీ నిర్ణయం కోసం వేచి చూస్తూనే..ఇటు టీడీపీ, జనసేన ఎన్నికలకు సిద్దం అవుతున్నాయి.

జనసేనాని పవన్ ఈ నెల 14వ తేదీ నుంచి వారాహి ద్వారా ప్రజల మధ్యకు రావాలని నిర్ణయించారు. ముందుగా గోదావరి జిల్లాల్లో పవన్ యాత్ర కొనసాగనుంది. ఇదే సమయంలో రెండు పార్టీల నుంచి అసెంబ్లీ పోటీ ఆశావాహుల తమ సీట్ల కోసం ప్రకటనలు చేస్తున్నారు. సీట్లు తమకే ఇవ్వాలని డిమాండ్లు మొదలు పెట్టారు.

 టీడీపీ ముఖ్య నేత నారా లోకేశ్ 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో తిరిగి మంగళగిరి నుంచి పోటీ చేసి గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. ముందునుంచి అక్కడ పక్కా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. దీనికి కౌంటర్ గా వైసీపీ అక్కడ చేనేత వర్గానికి ప్రాధాన్యత ఇస్తూ మాజీ మంత్రి మురుగుడుకు ఎమ్మెల్సీ పదవి.. టీడీపీ మాజీ నేత గంజి చిరంజీవికి చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్ష పదవి కట్టబెట్టింది. లోకేష్ ఈ సారి తన గెలుపు పైన ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు మంగళగిరి సీటు తమ పార్టీకే ఇవ్వాలని జనసేన మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాస రావు డిమాండ్ చేశాడు. తాను మొదటి నుంచి ఇదే అడుగుతున్నానని చెప్పారు. నియోజకవర్గంలో చేనేత సామాజిక వర్గం వారు బలంగా ఉన్నారని చెప్పుకొచ్చారు.