* జనసేన జెండా పట్టి వారాహి వెంట నడుద్దాం
* చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములవుదాం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో విప్లవాత్మకమైన మార్పు కోసం శంఖారావం మోగించడానికి బయలుదేరుతోంది వారాహి. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చేపట్టనున్న వారాహి యాత్ర రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించబోతోంది. జన సైనికులు, వీర మహిళలు, నాయకులు, జనసేన శ్రేణులు సమష్టిగా, సమాలోచనలతో వారాహి యాత్రను విజయవంతం చేస్తారని ఆశిస్తున్నానంటూ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. నాగబాబు ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో నెలకొన్న దుర్భరమైన పరిస్థితులకు సంబంధించి ప్రజల్లో ఆలోచనాత్మకమైన చైతన్యం పెరుగుతోంది. ప్రజలు కలిసి మెలసి జీవించే వాతావరణాన్ని కల్పించడానికి ఏర్పడిన రాజకీయం అనే పదాన్ని అడ్డం పెట్టుకొని కులాలుగా, మతాలుగా, ప్రాంతాలుగా, వర్గాలుగా విడదీస్తూ ఒక్కో పార్టీ, ఒక్కో నాయకుడు వారికి ఇష్టమొచ్చిన రీతిలో వాడేసుకుంటున్నారు. రాజకీయం అంటే అసలు నిర్వచనాన్ని అమలు చేయడానికి, ప్రజలంతా కలిసి మెలిసి జీవించే వాతావరణాన్ని సృష్టించడమే వారాహి యాత్ర ప్రధాన ధ్యేయం. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న అనిశ్చిత పరిస్థితుల నుండి గట్టెక్కాలంటే జనసేన పాలన రావాల్సిందే అనే ఆశాభావంతో రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ఇంకా అనేక వర్గాల ప్రజలు ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యక్తిగానే వేలాదిమందికి ఆపన్నహస్తం అందిస్తున్న విధానాన్ని ప్రత్యక్షంగా చూస్తున్న ప్రజలు ఆయనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అనే శక్తిని అందజేస్తే ఇంకెంతో మందికి ఉపయోగకరమైన సేవలు అందిస్తారు అనే భావన ప్రజల్లో బలంగా నాటుకుంది. ప్రజాధనం ఒక్క రూపాయి కూడా వృధా కాకుండా, అప్పులను అదుపు చేసి, అభివృద్ధి బాటలు వేయగల సమర్థత నిబద్దత గల నాయకుడు, నిజాయితీ పరుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అన్న అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉన్నది. రాజకీయాల్లో, రాష్ట్ర పరిపాలన విధానాల్లో ఖచ్చితమైన జవాబుదారీతనం జనసేనతో మాత్రమే సాధ్యం అవుతుందనేది మేధావి వర్గాల అభిప్రాయం. పవన్ కళ్యాణ్ గారు అన్ని ఆటు పోట్లను తట్టుకొని పదేళ్లుగా పార్టీని నడిపిస్తున్న నాయకత్వ పటిమతోనే రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి పథంలో నడిపించగలరు. పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా జనసేన జెండా పట్టి వారాహి వెంట అడుగులు వేద్దాం.. చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములవుదాం అని శ్రీ నాగబాబు పేర్కొన్నారు.