అభివృద్ధి క్షీణ దశకు చేరి, ప్రభుత్వ వ్యవస్థలన్నీ అస్తవ్యస్తమై ఉన్న స్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలనా పగ్గాలు చేపట్టిన ఎన్.డి.ఏ. ప్రభుత్వానికి జనసేన శ్రేణులు వెన్నుదన్నుగా నిలబడాలని, పార్టీకి చెందిన ఏ ఒక్కరూ ప్రభుత్వానికి,అధికారులకు వ్యతిరేకంగా మాట్లాడవద్దని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రాభివృద్ధి,ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తున్న తరుణంలో పార్టీ నియమనిబంధనలను ఉల్లంఘించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీలోని ఎవరు మాట్లాడినా, అధికారుల పని తీరును బలహీనపరిచే విధంగా లేదా ఆధారాలు లేని ఆరోపణలు చేసినా కఠిన చర్యలు తీసుకోవలసిందిగా పవన్ కళ్యాణ్  ఆదేశించారు. ప్రోటోకాల్ ఉల్లంఘించి అధికారిక సమావేశాలలో పార్టీ నాయకులుగాని, కార్యకర్తలుగాని పాల్గొనడం నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుంది. అటువంటివారిపై కూడా చర్యలు తప్పవు. తొలుత షోకాజ్ నోటీసు జారీ అవుతుంది. నోటీసుకు సంతృప్తికరమైన సమాధానం రాని పక్షంలో కఠినమైన చర్యలు తప్పవు. అందువల్ల పార్టీలోని ప్రతి ఒక్కరు పార్టీ ప్రతిష్టను ముందుకు తీసుకువెళ్లే విధంగా ముందుకు వెళ్ళవలసిందిగా మనవి అంటూ పవన్ కళ్యాణ్ అన్నారు.