పవన్ కల్యాణ్ వారాహి యాత్ర తొలి విడత ఈ రోజుతో పూర్తి కానుంది. జ్వరంతో బాధపడుతున్న పవన్ భీమవరం నియోజకవర్గంలోని పలు బీసీ వర్గాలతో సమావేశం అయ్యారు. తాజాగా శెట్టి బిలజ సంఘాల నేతలతో సమావేశమైన పవన్.. గౌడ కులస్థుడు సీఎం కావాలని జనసేన కోరుకుంటోందని వ్యాఖ్యానించారు. బీసీ కులాలన్నీ ఏకం కావాలని పవన్ పిలుపునిచ్చారు.ఏదో ఒకరోజు గౌడ కులస్థులు రాజ్యాధికారం చేపట్టాలని..సర్ధార్ గౌతు లచ్చన్నలా నాయకుడిగా ఎదిగి రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటుందని చెప్పుకొచ్చారు. జనసేనను విశ్వసించాలని కోరారు. నమ్మకం కలిగితే మద్దతు ఇవ్వాలని అభ్యర్ధించారు. బీసీలు రాజకీయంగా ఎదిగేందుకు కట్టుబడి ఉన్నామని పవన్ హామీ ఇచ్చారు.

పవన్ కల్యాణ్ 2019 ఎన్నికల్లో భీమవరం, గాజువాక నుంచి పోటీ చేసారు. రెండు స్థానాల్లోనూ ఓడిపోయారు. ఈ సారి పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే చర్చ సాగుతోంది. తిరిగి గోదావరి జిల్లాల్లోని ఒక స్థానంతో పాటుగా తిరుపతి నుంచి పోటీకి దిగుతారనే అంచనాలు ఉన్నాయి. గతంలో భీమవరం నుంచి పోటీ చేయటంతో ఈ సారి తూర్పు గోదావరి పిఠాపురం పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే, వచ్చే ఎన్నికల్లో తిరిగి భీమవరం నుంచే పోటీ చేయాలనే ఆలోచనతో పవన్ ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎక్కడ ఓడారో…తిరిగి అక్కడే తిరిగి గెలవాలనే పట్టుదలతో పవన్ ఉన్నట్లుగా పార్టీ నేతల సమాచారం. ఈ మేరకు ఈ రోజు భీమవరంలో జరిగే వారాహి తొలి విడత ముగింపు సభలో పవన్ కల్యాణ్ ప్రకటన చేస్తారని భావిస్తున్నారు.