జాతీయ ఉపాధి హామీ పథకం కింద తోటలను పెంచుకోవాలనుకునే వారు ఈ నెల 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గ ప్రక్రియ వల్ల ఇది ఇప్పటి దాకా ఎక్కువగా ప్రచారంలోకి రాలేదని దుబ్బాక ఎమ్మెల్యే, బీజేపీ నేత రఘునందనరావు గురువారం అన్నారు. అన్నదాతల సంక్షేమం కోసం ప్రధానమంత్రి మోదీ ఈ రోజు 1.25 లక్షల పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలను జాతికి అంకితం చేసిన సందర్భంగా శామీర్‌పేట్ పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో కిషన్ రెడ్డి, రఘునందనరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు.

‘నాయకులకు, రైతులకు ఒక చిన్న సూచన. కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో రైతన్నలకు కావాల్సినటువంటి వివిధ రకాల తోటలను పండించుకోవడానికి ఈ నెల31వ తేదీ వరకు భారత ప్రభుత్వం ఓ వెసులుబాటును కల్పించింది. అయితే మన రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గ ప్రక్రియ వల్ల ఇది ఇప్పటికీ ఇంకా ప్రచారంలోకి రాలేదు. అయిదు ఎకరాల లోపు ఉన్నటువంటి పట్టాదారులు, ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు రైతులు అందరు కూడా దీనికి దరఖాస్తు చేసుకోవాలి.ఉపాధి హామీ జాబ్ కార్డు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలి. బోరుబావులు, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలి. జాతీయ ఉపాధి హామీ పథకం కింద తోటలను పెంచుకోవాలనుకునే వారు అందరూ దరఖాస్తు చేసుకోవాలి. మామిడి, జామ, నిమ్మ, దానిమ్మ, సీతాఫలం, మునుగ, కొబ్బరి, డ్రాగన్ ఫ్రూట్ సహా పండించుకోవచ్చు. అర్హులు అందరు కూడా ఈ నెల 31వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ నాయకులు దీనికి విస్తృత ప్రచారం కల్పించాలి’ అని సూచించారు.