తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి క్రమంగా రాజుకుంటోంది. ఈ ఏడాది చివరి నాటికి కొత్త ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికార భారత్ రాష్ట్ర సమితి ప్రచార కార్యక్రమాలపై దృష్టి సారిస్తోంది. ఎన్నికలకు సమాయాత్తం కావాల్సిన ప్రస్తుత పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రశాఖలో అనూహ్య పరిణామాలు నెలకొన్నాయి.పార్టీలో అసంతృప్తి పతాకస్థాయికి చేరింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత తెలంగాణలో రాజకీయ పరిణామాలన్నీ బీజేపీకి ప్రతికూలంగా పరిణమించినట్లు భావిస్తోన్నారు ఆ పార్టీ సీనియర్ నాయకులు. ఇది కాస్తా పార్టీ అధిష్ఠానాన్ని కలవరపాటుకు గురిచేస్తోంది. కొందరు కీలక నేతలు సైతం పార్టీని వీడే ఆలోచనలో ఉన్నట్లు తేలిన నేపథ్యంలో బీజేపీ అధిష్ఠానం జోక్యం చేసుకుంది.