జాతీయ పార్టీగా మారిన భారత రాష్ట్ర సమితి వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేస్తుందా లేదా అనేది నిర్ణయించాల్సింది తమ బాస్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆరేనని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. ఈమేరకు ‘ఆస్క్ కవిత’ అంటూ శనివారం ఆమె నెటిజన్లతో ముచ్చటించారు. ఈ సందర్భంగా నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె జవాబిచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు దురదృష్టకరమని చెప్పారు. ఏపీలో బీఆర్ఎస్ పోటీ చేస్తుందా అన్న ప్రశ్నకు జవాబిస్తూ.. ‘బాస్ కా హుకూం’ అంటూ తన తండ్రి, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఫొటో పెట్టారు. తన వ్యక్తిగత అభిరుచులనూ కవిత నెటిజన్లతో పంచుకున్నారు. రాష్ట్రంలో తనకు అత్యంత ఇష్టమైన పర్యాటక ప్రాంతం నిర్మల్ జిల్లాలోని కుంటాల జలపాతం అని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతల ఆరోపణలను ప్రస్తావించిన మరో నెటిజన్ కు సమాధానంగా.. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఎలాంటి ఒప్పందం లేదని కవిత స్పష్టం చేశారు. బీజేపీకి బీ టీమ్ అన్న ఆరోపణలను ఖండించారు. తమ పార్టీది తెలంగాణ టీమ్ అని, బీజేపీ తమకు రాజకీయ ప్రత్యర్థి అని తేల్చి చెప్పారు.