హైదరాబాదులో ఇవాళ నిర్వహించిన ‘మహా మ్యాక్స్’ న్యూస్ చానల్ ప్రారంభోత్సవానికి జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, తదితర పరిణామాలపై చిత్ర పరిశ్రమ స్పందించకపోవడం పట్ల విమర్శలు వస్తుండడంపై ఆయన స్పందించారు. ప్రపంచంలో జరిగే ప్రతి విషయానికి సినీ ఇండస్ట్రీ స్పందించాలని కోరుకోవడం సబబు కాదని, అదేమంత తేలికైన విషయం కాదని అన్నారు. చిత్ర పరిశ్రమలోని వ్యక్తులు కళాకారులే తప్ప రాజకీయ నాయకులు కారన్న విషయాన్ని గుర్తించాలని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.రజనీకాంత్ వంటి వాళ్లు కూడా రాజకీయాలపై మాట్లాడలేరని, ఒకవేళ ఏదైనా మాట్లాడితే ఎంతటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయో తెలిసిందేనని అన్నారు. అందుకే చిత్ర పరిశ్రమ ఇటీవల రాజకీయ పరిణామాలపై స్పందించలేదని భావిస్తున్నానని తెలిపారు.  జీవితంలో వినోదం అనేది అత్యంత ముఖ్యమైనదని, ఆ వినోదంలో సినిమాది అగ్రస్థానం అని పవన్ కల్యాణ్ వివరించారు.