అధికార వైసీపీకి తాము తప్పకుండా రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. పార్టీ ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్రకుమార్‌లతో కలిసి ఆయన మంగళవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ…. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని తాము రాష్ట్రపతిని కోరామన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ అంశాన్ని ఆమె దృష్టికి తీసుకు వెళ్లామని, అలాగే ఏపీలో ప్రతిపక్షాలపై అణచివేత తీరును ఆమెకు వివరించామన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏపీలో అరాచక పాలన సాగుతోందని, దీనిని రాష్ట్రపతికి వివరించామన్నారు. నాలుగు దశాబ్దాలకు పైగా ప్రజాజీవితంలో ఉన్న చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పామన్నారు. టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిన అంశాలను వివరించినట్లు చెప్పారు. తమ వద్ద ఉన్న ఆధారాలను ఆమెకు ఇచ్చామన్నారు. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టినా అరెస్ట్ చేస్తున్నారని వాపోయారు.తాను యువగళం పాదయాత్రను తిరిగి ప్రారంభిస్తానని నిన్న ప్రకటించానని, దీంతో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో తన పేరును చేర్చారని మండిపడ్డారు. ఇన్నర్ రింగ్ రోడ్డు, స్కిల్ డెవలప్‌మెంట్, ఫైబర్ గ్రిడ్‌తో తనకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు లేకపోయినా కేసు ఎలా పెట్టారని నిలదీశారు. ఢిల్లీలో వివిధ పార్టీల నేతలను కలిసి రాష్ట్రంలో జరుగుతున్న వాటిపై వివరించినట్లు చెప్పారు. రోజుకో కేసుతో తమను ఇబ్బందులపాలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారని, దొంగ కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. తాను తప్పకుండా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే బాధ్యతను తీసుకుంటానన్నారు. కేసులకు సంబంధించి ప్రభుత్వం వద్ద ఎలాంటి ఆధారాలు లేవన్నారు.