జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై దాఖలైన క్రిమినల్ డిఫమేషన్ పిటిషన్‌ను రిటర్న్ చేసింది విజయవాడ సివిల్‌ కోర్టు. జనసేనాని ఏలూరు జరిగిన వారాహి యాత్రలో వాలంటీర్లపై తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో ఆయనపై ఓ మహిళా వాలంటీర్ ఈ పిటిషన్ కోర్టులో దాఖలు చేశారు.అయితే పిటిషన్‌ తమ పరిధిలోకి వస్తుందో రాదో స్పష్టం చేయాలని విజయవాడ సివిల్ కోర్టు ఆదేశించింది. అలాగే వాలంటర్ కి సంబంధించిన ఒరిజినల్‌ అపాయింట్‌మెంట్‌ తమ ముందు ఉంచాలని స్పష్టం చేసింది. అలాగే డిఫమేషన్‌ పిటిషన్‌ విజయవాడ కోర్టులో దాఖలు చేయడానికి కారణాలేంటో చెప్పాలని ఆదేశించింది.ఏలూరులో నిర్వహించిన వారాహి విజయయాత్ర సభలో వాలంటీర్లు సంఘవిద్రోహ శక్తులకు డేటా ఇస్తున్నారంటూ కామెంట్‌ చేశారు పవన్‌. అంతేకాదు వాలంటీర్ల కారణంగా రాష్ట్రంలో 30 వేల మంది మహిళలు కనిపించకుండపోయారని ఆరోపించారు. వాలంటీర్ల ప్రతిష్ఠకు పరువు నష్టం కలిగేలా పవన్‌ వ్యాఖ్యలు చేశారని ఐపీసీ సెక్షన్‌ 500, 504, 505 సెక్షన్ల కింద శిక్షించాలని కోరుతూ విజయవాడ శాంతినగర్‌కు చెందిన రంగవల్లి అనే వాలంటీర్ విజయవాడ సివిల్‌ కోర్టు లో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై కోర్టు తాజాగా ఈ ఆదేశాలు ఇచ్చింది.