సూర్యాపేట సమీపంలోని మేళ్లచెర్వు దగ్గర ఉన్న మై హోమ్ సంస్థకు చెందిన సిమెంట్ కర్మాగారంలో చోటు చేసుకున్న ప్రమాదంలో అయిదుగురు వలస కార్మికులు మృతి చెందటం దురదృష్టకరమని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు. కార్మికుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. మృతుల కుటుంబాలకు న్యాయబద్ధమైన ఆర్థిక పరిహారాన్ని అందించాలి. ప్రసార మాద్యమాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం 500 అడుగుల ఎత్తులో కాంక్రీట్ పనులు చేస్తుండగా లిఫ్ట్ కూలడంతో ఈ ఘోరం చోటు చేసుకున్నట్లు తెలిసింది. కర్మాగారాల్లో భద్రతా ప్రమాణాలు పాటించడం, ఆ ప్రమాణాలను సంబంధిత శాఖలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన అవసరాన్ని ఈ ప్రమాదం ద్వారా మరోమారు గుర్తు చేస్తోంది. పొట్ట కూటి కోసం రాష్ట్రాలు దాటి వస్తున్న కార్మికుల జీవితాలకు ప్రభుత్వాలు, కర్మాగారాల యాజమాన్యాలు భరోసా కల్పించాలి. తెలంగాణ రాష్ట్రానికి ఉపాధి కోసం వలస వస్తున్న కార్మికుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. బీహార్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఆంధ్ర ప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి వలస వస్తున్న కార్మికుల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేసే బాధ్యత రాష్ట్ర కార్మిక శాఖ తీసుకోవాలని కోరుతున్నానని జనసేనాని పేర్కొన్నారు.