వచ్చే ఎన్నికల్లో గెలిచి చంద్రబాబు అధికారంలోకి వస్తారని నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు. ఒక చేత్తో పది రూపాయలు ఇచ్చి మరో చేత్తో వంద రూపాయలు లాగేస్తున్నట్టుగా వైసీపీ పాలన ఉందని విమర్శించారు.  నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలిచి మళ్లీ అధికారంలోకి వస్తే వ్యాపారులు బతికే పరిస్థితి ఉండదని అన్నారు. ఏపీలో కరెంటు షాకులు కొట్టాలంటే కరెంటును పట్టుకోవాల్సిన పనిలేదని, జగనన్న కరెంటు బిల్లులు పట్టుకుంటే చాలని ఎద్దేవా చేశారు.

టీడీపీ, జనసేన ప్రభుత్వం ఏర్పాటయ్యాక తిరిగి అన్న క్యాంటీన్లు ప్రారంభమవుతాయని శ్రీధర్‌రెడ్డి తెలిపారు. తమిళనాడులో స్టాలిన్ అధికారంలోకి వచ్చాక ఎలాంటి భేషజాలకు పోకుండా ‘అమ్మ క్యాంటీన్ల’ను అదే పేరుతో కొనసాగిస్తున్నారని గుర్తు చేశారు. జగన్‌కు అన్నక్యాంటీన్ పేరు నచ్చకపోతే జగనన్న క్యాంటీన్ పేరుతో దానిని కొనసాగించాల్సిందని, కానీ ఇలా వాటిని మూసేసి పేదల కడుపు కొట్టడం సమంజసం కాదని అన్నారు. 30 ఏళ్లుగా క్వార్ట్జ్‌కు సరైన ధరలేక వ్యాపారులు ఇబ్బంది పడ్డారని, ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో మంచి ధర పలుకుతున్న వేళ గనులను స్వాధీనం చేసుకోవడంతో వ్యాపారులు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు.