టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నిరసనలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఇక్కడ ర్యాలీలు ఎందుకు, ఏపీలో చేసుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో తమకు ఏం సంబంధమని ప్రశ్నించారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… చంద్రబాబు అరెస్టుపై ఇక్కడ ర్యాలీలు వద్దని, రాజమండ్రిలో భూమి దద్దరిల్లేలా చేసుకోవాలని సూచించారు. చంద్రబాబు అరెస్ట్ అయింది ఏపీలో అని, అక్కడ నిర్మోహమాటంగా చేసుకోవచ్చునని చెప్పారు. ఇక్కడ హైదరాబాద్‌లో ఎవరు చేసినా ఊరుకునేది లేదని హెచ్చరించారు.హైదరాబాద్‌లో ర్యాలీ చేసి, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తారా? అని ప్రశ్నించారు. తాను లోకేశ్, జగన్, పవన్ కల్యాణ్ ముగ్గురికీ మిత్రుడినే అన్నారు. తనకు లోకేశ్ ఫోన్ చేసి, హైదరాబాద్‌లో ర్యాలీకి ఎందుకు అనుమతి ఇవ్వలేదని అడిగారని, అయితే శాంతిభద్రతల సమస్య రాకుండా ఉండాలనే అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేసినట్లు చెప్పారు. ఐటీ కారిడార్ డిస్టర్బ్ కావొద్దనే అనుమతి ఇవ్వలేదన్నారు. ఈ రోజు వీరు ర్యాలీ చేస్తే, రేపు వారు ర్యాలీ చేస్తే, పోటాపోటీ ర్యాలీతో ఇక్కడ శాంతిభద్రతల సమస్య వస్తుందన్నారు. ఏపీ రాజకీయాలతో తెలంగాణకు సంబంధం లేదన్నారు