తెలుగుదేశం అధినేత చంద్రబాబు త్వరగా విడుదల కావాలంటూ ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశవిదేశాల్లోని ఆయన అభిమానులు, టీడీపీ కార్యకర్తలు సర్వమత ప్రార్థనలు చేస్తున్నారు. ఆలయాలు, చర్చిలు, మసీదులలో ప్రత్యేక ప్రార్థనలు జరిపిస్తున్నారు. చంద్రబాబును జైలుకు తరలించినప్పటి నుంచి ఆయన కుటుంబ సభ్యులు కూడా రాజమండ్రిలోనే ఉంటున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు సతీమణి బుధవారం చర్చికి వెళ్లారు. రాజమండ్రి జాంపేటలోని సెయింట్‌ పాల్స్‌ లూథరన్‌ చర్చిలో నారా భువనేశ్వరి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. క్యాండిల్స్ వెలిగించి చంద్రబాబు త్వరగా బయటకు రావాలని కోరుకున్నారు. నారా భువనేశ్వరి రాక నేపథ్యంలో లూథరన్ చర్చిలో ఫాస్టర్లు ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో భువనేశ్వరితో పాటు ఆమె సన్నిహితులు, పలువురు నేతలు పాల్గొన్నారు.