బీజేపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సామాజిక అనుసంధాన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఓ ట్వీట్ చేశారు. త్వరలో తాను కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. అనంతరం తాను కాంగ్రెస్‌లో ఎందుకు చేరుతున్నానో చెబుతూ ట్వీట్ చేశారు. కార్యకర్తలే నా బలం… అభిమానులే నా ఊపిరి… వారి ఆకాంక్షలే నా ఆశయం… పదవులు నాకేం కొత్త కాదు… ప్రజల కోసమే నా నిర్ణయం… నా కార్యకర్తలు, అభిమానులందరి అభిప్రాయాల మేరకు కాంగ్రెస్‌లో చేరాలని తీసుకున్న నా నిర్ణయానికి అందరి ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తున్నాను.. మీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అని ట్వీట్ చేశారు.కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దాదాపు ఏడాదిన్నర క్రితం కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఆ తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీ అభ్యర్థిగా మునుగోడు ఉపఎన్నికలకు వెళ్లారు. బీఆర్ఎస్ అభ్యర్థిపై స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. అయితే నాడు బీఆర్ఎస్‌కు బీజేపీయే ప్రత్యామ్నాయం అని చెప్పిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రత్యామ్నాయమని చెబుతూ బీజేపీకి గుడ్‌పై చెప్పి హస్తం పార్టీ వైపు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఎల్లుండి ఢిల్లీలో రాహుల్ గాంధీ తదితరుల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.