హిందూపురం ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచార పర్వంలోకి అడుగుపెట్టనున్నారు. టీడీపీ విజయం కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆయన బస్సు యాత్ర చేయనున్నారు. నందమూరి బాలకృష్ణ బస్సు యాత్రకు స్వర్ణాంధ్ర సాకార యాత్ర పేరును ఖరారు చేశారు. ఇందుకోసం ఇప్పటికే ప్రత్యేక బస్సును కూడా సిద్ధం చేశారు. ఆయన నిర్వహించే సూపర్ హిట్ షో పేరుతో బాలయ్య అన్ స్టాపబుల్ అంటూ బస్సుపై ప్రత్యేక క్యాప్షన్ ఇవ్వటం విశేషం . అలాగే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి లోగోను ముద్రించారు. మొత్తం బస్సును టీడీపీ కలర్ అయిన పసుపు రంగుతో ముంచేశారు. అలాగే బస్సు మీద నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఫోటోలను ముద్రించారు. నందమూరి బాలకృష్ణ నిర్వహించే స్వర్ణాంధ్ర సాకార యాత్ర శనివారం కదిరిలో ,కదిరి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో పూజల అనంతరం ప్రారంభం కానుంది. ప్రారంభం కానుంది. అనంతరం ఉమ్మడి అనంతపురం జిల్లా, కర్నూలు జిల్లాలలో బాలయ్య స్వర్ణాంధ్ర సాకార యాత్ర సాగనుంది. ఏప్రిల్ 13న కదిరి, పుట్టపర్తి నియోజకవర్గాలలో బస్సు యాత్ర కొనసాగనుంది . అలాగే ఏప్రిల్ 14న శింగనమల నియోజకవర్గంలోని కల్లూరు, అనంతపురంలోని సప్తగిరి సర్కిల్‌ మీదుగా యాత్ర సాగనుంది. మరోవైపు టీడీపీ తరుఫున చంద్రబాబు, నారా భువనేశ్వరి, నారా లోకేష్ ఇప్పటికే ప్రచారం చేస్తుండగా.. తాజాగా బాలయ్య కూడా ఎంట్రీ ఇవ్వనున్నారు. చంద్రబాబు ప్రజాగళం, నారా భువనేశ్వరి నిజం గెలవాలి, లోకేష్ శంఖారావం సభలతో ప్రచారాన్ని కొనసాగిస్తుంటే తాజాగా నందమూరి బాలకృష్ణ సైతం ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.