జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి`సినిమా 1990వ దశకంలో ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. అయితే ఈ మూవీకి సీక్వెల్ తీయాలని వైజ‌యంతి మూవీస్ అధినేత‌, నిర్మాత అశ్వ‌నిద‌త్ చాలా ప్ర‌య‌త్నాలు చేసారు. అప్ప‌ట్లో రామ్ చ‌ర‌ణ్ – జాన్వీ క‌పూర్ జంట‌గా ఈ సీక్వెల్ నిర్నీతమవుతుందని వార్తలు వచ్చినా స్క్రిప్టు రెడీ కాక‌పోవ‌డంతో అది సాధ్య‌ప‌డ‌లేదు. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ సీక్వెల్ కోసం క‌థ‌న రెడీ చేస్తున్నట్టు ప్రచారం జరిగినా అది నిజం కాలేదు . ఇటీవ‌ల‌ బుచ్చిబాబు కొత్త సినిమా లాంచ్ లో జాన్వీక‌పూర్ స‌మ‌క్షంలో రామ్ చ‌ర‌ణ్ మాట్లాడుతూ.. జాన్వీ నేను జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి సీక్వెల్లో న‌టించాల‌ని అభిమానులంతా కోరుకుంటున్నారని, అలాంటి రోజు రావాల‌ని ఆశిస్తున్నాన‌ని అన్నారు. తాజాగా ఓ స‌మావేశంలో చిరు మాట్లాడుతూ. ఇదే అభిప్రాయం వ్య‌క్తం చేసారు. రామ్ చ‌ర‌ణ్- జాన్వీ క‌పూర్ జంట త‌న బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా జగ‌దేక వీరుడు- అతిలోక సుంద‌రి సీక్వెల్లో న‌టిస్తే చూడాల‌నుంద‌న్నారు . త్వ‌ర‌లో ఆ క‌ల నెర‌వేరాలని, జాన్వీ ప్ర‌స్తుతం చ‌ర‌ణ్ తో బుచ్చిబాబు సినిమా చేస్తోందని , త‌న‌తో మాట్లాడుతుంటే శ్రీ‌దేవి గుర్తుకొచ్చి ఎమోష‌న‌ల్ అయ్యానని చిరు చెప్పారు . ఇండ‌స్ట్రీ శ్రీదేవి లాంటి మంచి న‌టిని కోల్పోయిందని చిరు తనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. చిరంజీవి- శ్రీ‌దేవి నాయ‌కానాయిక‌లుగా షాలిని, షామిలీ బాల‌ న‌టీమ‌ణులుగా, అమ్రిష్ పురి విల‌న్ గా న‌టించిన జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి చిత్రానికి కె.రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ చిత్రం ఫాంట‌సీ జాన‌ర్ లో మ్యూజిక‌ల్ హిట్ చిత్రంగా నిలిచింది. అయితే జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి లాంటి క్లాసిక్ హిట్ కి సీక్వెల్ అంటే మాటలు కాదు. అందుకే ఇంత‌కాలం ఈ సినిమాకి సీక్వెల్ రాలేదు. కానీ తాజా ప‌రిణామం చూస్తుంటే రామ్ చ‌ర‌ణ్ – జాన్వీ క‌పూర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో ఈ సినిమా సీక్వెల్ తెర‌కెక్కేందుకు ఆస్కారం ఉంది.