పార్ల‌మెంట్‌ ఎన్నిక‌ల నేప‌థ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఇప్ప‌టివ‌ర‌కు 13 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. దీనిలో భాగంగా గులాబీ బాస్ కేసీఆర్ శుక్ర‌వారం ఇద్ద‌రు కొత్త‌ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. మెదక్ స్థానం నుంచి మాజీ ఐఏఎస్ అధికారి వెంకట్రాంరెడ్డి, అలాగే నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఇటీవలే బీఆర్ఎస్ పార్టీలో చేరిన మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు అవకాశం ఇచ్చారు. ఇలా ఇద్ద‌రు మాజీ సివిల్ స‌ర్వెంట్ల‌కు బీఆర్ఎస్ లోక్‌స‌భ ఎంపీ టికెట్లు కేటాయించ‌డం ప‌ట్ల ఆ పార్టీ మాజీ మంత్రి, వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఒక ట్వీట్ చేశారు. 

“ఇద్ద‌రు ఆల్ ఇండియా మాజీ ఆఫీస‌ర్లు బీఆర్ఎస్ టికెట్‌పై లోక్‌స‌భ ఎన్నిక‌ల బ‌రిలో నిలుస్తున్నారు. ఈ గొప్ప నిర్ణ‌యం తీసుకున్న‌ కేసీఆర్ గారికి అభినంద‌న‌లు. నాగర్ కర్నూల్ నుంచి పోటీ చేస్తున్న మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌, మెద‌క్ నుంచి పోటీ చేస్తున్న మాజీ ఐఏఎస్ అధికారి వెంకట్రాంరెడ్డిల‌కు శుభాకాంక్ష‌లు. ఈ ఇద్ద‌రిని ప్ర‌జ‌లు గెలిపించి పార్ల‌మెంట్‌కు పంపుతార‌నే న‌మ్మ‌కం ఉంది” అని కేటీఆర్ త‌న‌ ట్వీట్‌లో పేర్కొన్నారు.