ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం, ఓట్లు చీలవద్దనే ఉద్దేశంతో ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేస్తున్నామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు తెలిపారు. పొత్తుల వల్ల కొంతమంది నేతలకు టికెట్ ఇవ్వలేకపోయానని చెప్పారు. టీడీపీ కోసం పనిచేసిన 31 మంది నేతలకు టికెట్ ఇవ్వడం సాధ్యం కాలేదన్నారు. అయితే, పార్టీకి వారు చేసిన సేవలను తాను మర్చిపోలేదని, ఇకపైనా మర్చిపోబోనని స్పష్టం చేశారు. మూడు పార్టీల్లోనూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన వాళ్లు ఉన్నారని చెప్పారు. పొత్తుల కారణంగా అందరికీ టికెట్ ఇవ్వడం సాధ్యం కాలేదని వివరించారు. పొత్తులతో సంబంధం లేకుండా కొందరి సీనియర్లకు కూడా టిక్కెట్లు ఇవ్వలేకపోయామని చెప్పారు. ఈ మూడు పార్టీల నేతల త్యాగాల పునాది రాష్ట్ర భవిష్యత్తుకు ఊతమిచ్చేలా ఉండాలని ఆకాక్షించారు.