టీడీపీ అధినేత చంద్రబాబును తన కుమారుడి వివాహానికి షర్మిల ఆహ్వానించారు. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన షర్మిల… కుమారుడు రాజారెడ్డి పెళ్లికి చంద్రబాబు కుటుంబాన్ని ఆహ్వానించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “వైఎస్ రాజశేఖరరెడ్డి గారి మనవడు రాజా రెడ్డి పెళ్లి జరుగుతున్న తరుణంలో చాలా మంది రాజకీయ నాయకులను పెళ్లికి ఆహ్వానిస్తున్నాం. ఇందులో భాగంగానే చంద్రబాబు గారిని కూడా పెళ్లికి వచ్చి వధూవరులను ఆశీర్వదించాలని కోరడం జరిగింది. చాలాసేపు రాజశేఖరరెడ్డి గురించి, వారి స్నేహం గురించి, వారి రాజకీయ ప్రారంభ దశలో జరిగిన ప్రస్థానం గురించి చంద్రబాబు అన్నీ గుర్తు చేసుకున్నారు. నాకు గుర్తు చేశారు. ఇద్దరం చాలా సేపు మాట్లాడాం. చాలా సంతోషం అనిపించింది. పెళ్లికి వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదిస్తానని మాట ఇచ్చారు. మా మధ్య చర్చలో ఎక్కువగా రాజశేఖరరెడ్డి గురించే ప్రస్తావించారు. ఇద్దరి ప్రయాణం, జీపులో కలిసి తిరగడం, పొద్దున్నుంచి రాత్రి వరకు కలిసి ఉండటం, ఇద్దరూ ఢిల్లీకి కలిసి వెళ్లడం, సీఎం పదవి కోసం ఇద్దరూ చేసిన ప్రయత్నాలు.. ఇలాంటివన్నీ చెప్పుకుంటూ వచ్చారు.