జనసేన పార్టీ అధినేత పవన్ స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో యువతీయువకులతో సమావేశమయ్యారు. 

ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, అధికారంలోకి వచ్చాక యువత గొంతుక అవుతానని ఉద్ఘాటించారు. యువత చెప్పే ప్రతి ఆలోచనను తాను శ్రద్ధగా వింటానని తెలిపారు. అవసరమైతే అన్నీ ఆలోచించి ప్రజా పాలసీగా తీసుకువస్తానని అన్నారు. ఈసారి జనసేన-టీడీపీ ప్రభుత్వం వస్తుందని, వచ్చే ప్రభుత్వంలో జవాబుదారీతనం తీసుకువస్తామని పవన్ చెప్పారు. యువతకు మంచి భవిష్యత్ కల్పించేలా భరోసా ఇస్తామని పేర్కొన్నారు. “ఉక్కు నరాలు, ఇనుప కండరాలు కలిగిన యువ సమూహమే జనసేన పార్టీకున్న బలం… బలగం. వైసీపీ వంటి నేరపూరిత ఆలోచనలు ఉన్న పార్టీతో పోరాడగలుగుతున్నాను అంటే యువత అండగా ఉండడం వల్లే. యువత నాలో తమను తాము చూసుకుంటారు. దశాబ్దకాలంగా నన్ను అన్ని విధాలా నమ్మిన యువతకు నేను కచ్చితంగా అండగా నిలబడతాను” అని పేర్కొన్నారు.