కత్తిదాడికి గురైన మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి మరో నాలుగు రోజులు ఐసీయూలో ఉండనున్నారు. నిన్న మూడు గంటలకు పైగా వైద్యులు శ్రమించి ఆపరేషన్ నిర్వహించారు. చిన్నపేగును వైద్యులు 10 సెంటీ మీటర్ల మేర తొలగించారు. ప్రస్తుతం ఐసీయూలో ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి మరో నాలుగు రోజులు అందులోనే ఉండనున్నారు. ఇదిలా ఉండగా, కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం కేసును సిద్దిపేట పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. కేసు విచారణను వేగవంతం చేశారు. రాజకీయ కుట్ర కోణంలో విచారణ జరుపుతున్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి చేసిన రాజును ఇప్పటికే అరెస్ట్ చేసిన పోలీసులు అతని నుంచి వివరాలు సేకరిస్తున్నారు. రాజు కుటుంబ సభ్యులను కూడా విచారించారు. నిందితుడి కాల్ డేటాను పరిశీలిస్తున్నారు. ఎంపీపై దాడి తర్వాత బీఆర్ఎస్ కార్యకర్తలు నిందితుడు రాజును చితకబాదారు. దీంతో అతనిని గాంధీ ఆసుపత్రికి తీసుకు వచ్చి చికిత్స అందిస్తున్నారు. కోలుకున్న తర్వాత కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం నేపథ్యంలో బీఆర్ఎఎస్ మంగళవారం దుబ్బాక నియోజకవర్గంలో బంద్‌కు పిలుపునిచ్చింది.