తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉందంటూ బీజేపీ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ఏదైనా జరగొచ్చని హెచ్చరించారు. మాజీ సీఎం కేసీఆర్ కు ప్రజాస్వామ్యంపై నమ్మకంలేదని, కుట్రలకు ఆయనే కేరాఫ్ అడ్రస్ అని ఆరోపించారు. ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాన్ని కూల్చేసే అవకాశం ఉందని తెలిపారు. పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ తో టచ్ లో ఉన్నారని బండి సంజయ్ చెప్పారు. జాగ్రత్తగా ఉండాలని, మాజీ సీఎం కదలికలపై ఓ కన్నేసి ఉంచాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతలకు ఆయన హితవు పలికారు.

రాష్ట్రంలో మనం మనం తర్వాత కొట్లాడుదాం.. ముందు బీఆర్ఎస్ ను బొందపెడదామని కాంగ్రెస్ కు బండి సంజయ్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నా.. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా.. తెలంగాణలో మెజారిటీ ఎంపీ స్థానాలను బీజేపీ గెల్చుకోవాలని ఆయన తెలిపారు. తెలంగాణలో ఐదేళ్ల పాటు సుస్థిర ప్రభుత్వం ఉండాలన్నదే బీజేపీ ఉద్దేశమని వివరించారు. ఎమ్మెల్యేలను లాగేసుకుని ప్రభుత్వాలను కూల్చే సంస్కృతి బీజేపీకి లేదని బండి సంజయ్ చెప్పారు.