తెలుగు దేశం – జనసేన కోసం కాదు, తెలుగు జాతి భవిష్యత్తు కోసం ఆలోచించాలని, ఈ సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలంతా సంకల్పం తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈమేరకు రాజధాని గ్రామం మందడంలో నిర్వహించిన భోగి వేడుకల్లో ఆయన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తో కలిసి పాల్గొన్నారు. ప్రజలందరికీ భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. రాజధాని కోసం అమరావతి రైతులు ఐదేళ్లుగా అలుపెరగకుండా పోరాడుతున్నారని ఆయన మెచ్చుకున్నారు. వారికి తప్పకుండా న్యాయం జరుగుతుందని ఆకాంక్షించారు. వైసీపీ పాలనలో రాష్ట్ర భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఎక్కడా, ఎవరూ మూడు రాజధానులు ఏర్పాటు చేయరని చెప్పారు. అధికారంలోకి రాకముందు ఇదే పెద్ద మనిషి (జగన్) అమరావతే రాజధాని అని చెప్పారని చంద్రబాబు గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చాక మాట మార్చి మూడు రాజధానులని ప్రజలను మోసం చేశాడన్నారు.