తెలుగు రాష్ట్రాల్లో భోగి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చిన్నాపెద్దా అందరూ ఉత్సాహంగా భోగి వేడుకల్లో పాల్గొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని మందడంలో నిర్వహించిన భోగి వేడుకల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. అమరావతి జేఏసీ, తెలుగుదేశం, జనసేన ఆధ్వర్యంలో ‘తెలుగుజాతికి స్వర్ణయుగం-సంక్రాంతి సంకల్పం’ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. చంద్రబాబు, పవన్‌తో ఫొటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు పిల్లలు, పెద్దలు పోటీపడ్డారు. చంద్రబాబు, పవన్ ఇద్దరూ సంప్రదాయ దుస్తులు ధరించి వేడుకల్లో పాల్గొన్నారు.

మందడంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు టీడీపీ, జనసేన కార్యకర్తలతోపాటు రాజధాని రైతులు ఘనస్వాగతం పలికారు. అనంతరం నేతలు ఇద్దరూ కలిసి భోగిమంటలు వెలిగించారు. అధికార వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ప్రజావ్యతిరేక నిర్ణయాల ఉత్తర్వులు, అమరావతి వ్యతిరేక ప్రతులను మంటల్లో వేసి నిరసన తెలిపారు.