తెలంగాణలో పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ప్రధాన పార్టీల మధ్య మాటల దాడి మరింత ముదురుతోంది. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఇవాళ జరిగిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ చీఫ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డిల్లో పోటీ చేస్తున్నారని, ఆయన రెండు చోట్లా ఓడిపోతారని స్పష్టం చేశారు. ప్రజల్లో ఎంతటి ఆగ్రహజ్వాలలు రగులుతున్నాయో రేపటి ఎన్నికల్లో తెలుస్తుందని అన్నారు. తెలంగాణ యువత సునామీలా విజృంభించి బీఆర్ఎస్ పార్టీని తుడిచిపెట్టేస్తుందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితమే తెలంగాణ అంతటా పునరావృతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. కాగా, తెలంగాణ ఎన్నికల్లో తాము జనసేనతో కలిసి పోటీ చేస్తున్నామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.