ప్రధాని నరేంద్రమోదీ హాజరుకానున్న బీసీల ఆత్మగౌరవ సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. ఈ సభ ఎల్బీ స్టేడియంలో సాయంత్రం ఐదు గంటలకు జరగనుంది. ఇప్పటికే తెలంగాణలో జనసేన – బీజేపీ మధ్య పొత్తు ఖరారైంది. జనసేనకు 8 సీట్లు ఇచ్చేందుకు బీజేపీ సంసిద్ధత వ్యక్తం చేసింది. శేరిలింగంపల్లి సీటును కూడా కేటాయించాలని జనసేన పట్టుబడుతోంది. చిన్న చిక్కులు మినహా పొత్తు ఖరారైనట్లే. ఈ నేపథ్యంలో మోదీ బహిరంగ సభకు పవన్ హాజరు కానున్నారు. ప్రధాని మోదీ సభ అనంతరం పొత్తులు, సీట్లపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఎల్బీ స్టేడియంలో బీసీల ఆత్మగౌరవ సభ నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బషీర్ బాగ్ నుంచి, ఏఆర్ పెట్రోల్ పంప్ నుంచి, గన్ ఫౌండ్రి నుంచి వెళ్లే వాహనాలను దారి మళ్లించారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఎన్నికల షెడ్యూల్ అనంతరం ప్రధాని మోదీ సభ ఇదే మొదటిది. గత సభలలో కేంద్రమంత్రి అమిత్ షా బీసీకి ముఖ్యమంత్రి పదవి ఇస్తామని ప్రకటించారు. ఈ సభలో నరేంద్రమోదీ నోటి నుంచి కూడా ఆ ప్రకటన వెలువడుతుందని చెబుతున్నారు. బీసీ ఆత్మగౌరవ సభకు లక్ష మంది వరకు ప్రజలు వస్తారని అంచనా.