ఆంధ్రప్రదేశ్ లో పోలీసుల తీరు తాలిబాన్ల పాలనను తలపిస్తోందని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. ఎలాంటి నేర చరిత్ర లేని, కేసులు లేని టీడీపీ దళిత నేత ముల్లంగి వెంకటరమణపై పోలీసుల ధాష్టీకాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. చేతులు వెనక్కి కట్టి, నోట్లో గుడ్డలు కుక్కి చిత్రహింసలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ ప్రైవేటు సైన్యంలా పోలీసులు మారిపోయారని తీవ్ర విమర్శలు చేశారు. ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలను అణచివేస్తున్నారని లోకేశ్ ఆరోపించారు. బహిరంగ వేదికలపై ఎస్సీ, ఎస్టీ, బీసీలపై ప్రేమను ఒలకబోసే ముఖ్యమంత్రి జగన్.. ముల్లంగి వెంకటరమణపై పోలీసుల దుశ్చర్యను ఎలా సమర్థించుకుంటారని ప్రశ్నించారు. తమ పార్టీ దళిత నేతను అక్రమంగా నిర్బంధించిన కల్లూరు సీఐపై వెంటనే విచారణ జరిపించి అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కల్లూరు సీఐపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. దళితులపై రాజ్యహింసను అడ్డుకోవాలని లోకేశ్ కోరారు.