ఉమ్మడి కృష్ణా జిల్లాలో జనసేనాని పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర కొనసాగుతోంది. ఈ సాయంత్రం కైకలూరు నియోజకవర్గంలోని ముదినేపల్లిలో ఏర్పాటు చేసిన సభలో పవన్ కల్యాణ్ ప్రసంగించారు. 2019లో తమకు ఓట్లు వేసిన కైకలూరు ప్రజలను గుండెల్లో పెట్టుకున్నానంటూ వ్యాఖ్యానించారు. ఇక్కడికి వస్తుంటే ప్రజలు దారిపొడవునా స్వాగతం పలికారని, వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు. ఈ క్రమంలో ఆయన ఏపీ అధికార పక్షం వైసీపీపైనా, సీఎం జగన్ పైనా ధ్వజమెత్తారు. 151 మంది ఎమ్మెల్యేలు, 30 మంది ఎంపీల బలం ఉన్న పార్టీ వైసీపీ… ఏ పదవి లేని, కేవలం జనసైనికుల బలం ఉన్న పార్టీ జనసేన పార్టీ అని పవన్ ఉద్ఘాటించారు. తాము ఎవరికీ భయపడబోమని, ఇవాళ టీడీపీ వాళ్లకు కూడా మేమున్నాం అనే బలాన్ని అందించామని తెలిపారు.