వైసీపీ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నానిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్ర విమర్శలు గుప్పించారు. టీడీపీ నుంచి ఎంపీలుగా గెలిచిన గల్లా జయదేవ్ కు, రామ్మోహన్ నాయుడులకు చంద్రబాబు పదవులు ఇచ్చారని… నీకు ఎలాంటి పదవి ఇవ్వలేదని… ఎందుకంటే, నీవు విశ్వాసం లేని వ్యక్తివి అంటూ వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నీకు నోటి వాగుడు ఎక్కువయిందని, నిన్ను ఎంకరేజ్ చేయకూడదనే ఉద్దేశంతోనే పదవి ఇవ్వలేదని చెప్పారు. అన్నం పెట్టిన చేతినే కొరికే రకానివని దుయ్యబట్టారు. 
తిరువూరు పార్టీ ఆఫీసుకు వెళ్లి వీరంగం చేశావని నానిపై వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీలో ఉన్నంత వరకు ఎంత వాగినా సహనంతో భరించామని… ఇకపై సహనంగా ఉండబోమని చెప్పారు. చంద్రబాబు, లోకేశ్, వారి కుటుంబం గురించి ఏం మాట్లాడినా తాట తీస్తామని హెచ్చరించారు. మొన్నటి వరకు కేశినేని నాని వెంట తిరిగిన వారంతా తాము నాని వ్యక్తులం కాదని అంటున్నారని… వారికి శాల్యూట్ చేస్తున్నానని అన్నారు.