కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజకీయ ప్రయోజనాలు తప్ప రైతు ప్రయోజనాలు పట్టవని.. ఇకనైనా వారు మేల్కొని అన్నదాతకు అండగా నిలబడాలని బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేశారు. ఎకరాకు రూ.10వేల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట, రంగారెడ్డి తదితర జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వాన అన్నదాతను అతలాకుతలం చేసిందని… పంటలు చేతికి రానున్న సమయంలో కురిసిన వడగళ్ల వాన రైతులకు కన్నీరు మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. వరి, మొక్కజొన్న, జొన్న పంటలతోపాటు బొప్పాయి, మామిడి సహా ఇతర ఉద్యాన పంటలు దెబ్బతినడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు.