ఈ పదేళ్ళ కాలంలో కేసీఆర్ దోచుకున్న సొమ్మును తాము అధికారంలోకి వచ్చాక పేద ప్రజల ఖాతాల్లో వేస్తామని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. కల్వకుర్తిలో కాంగ్రెస్ విజయ భేరీ సభలో ఆయన మాట్లాడుతూ… ఇప్పుడు దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. ఓ వైపు అవినీతిపరులైన ముఖ్యమంత్రి, మంత్రులు, అధికార పార్టీ నేతలు అని, మరోవైపు రైతులు, పేదప్రజలు అని, ప్రజలు ఆలోచించాలన్నారు. తెలంగాణ కోసం ప్రజలంతా కలలు కన్నారని, తమ ఆశలు నెరవేరుతాయని భావించారని, కానీ కేసీఆర్ పాలనలో వారి ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. రాష్ట్రంలో డబ్బులు వచ్చే మంత్రిత్వ శాఖలన్నీ కేసీఆర్ కుటుంబం వద్దే ఉన్నాయని ఆరోపించారు. మద్యం, భూములు, ఆర్థిక.. ఇలా అన్ని శాఖలు వారివద్దే ఉన్నాయన్నారు.